మైలవరం ప్రాజక్టు పట్ల నిర్లక్ష్యం

0
8

కడప జిల్లా జమ్మలమడుగు సమీపానం పెన్నానది మీద నిర్మించిన ప్రాజక్టు ఇది. హైదరాబాద్ ,విజయవాడల నుంచి బస్సులో రావచ్చు. రైలులో వస్తే ఎర్రగుంట్ల దిగిరాావాలి. కారులో వచ్చే వారికి సమస్యేమీ లేదు. చుట్టూర కొండలతో కోనలతో ఈ ప్రాంతం చూడ ముచ్చటగా ఉంటుంది ఈ ప్రాజక్టు ప్రదేశం. దీనికి చాలా పర్యాటక ప్రాముఖ్యం ఉంది. గడ్డి కూడా మొలవని కొన్నిరకాల కొండలను ఇక్కడ ప్రకృతి అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దింది. డ్యామ్ సమీపంలో గురప్పడు, చెన్నకేశవ కోన, అగస్తీశ్వర కోన ఉంటాయి.

జమ్మల మడుగుకు మరొక వైపున వెళ్లితే 11కి.మీ దూరాన చారిత్రక గండికోట వస్తుంది. అక్కడి లోయలో ప్రవహించే పెన్నానదిని గండికోట అంచున కొండ రాళ్ల మీద కూర్చుని ఎంతసేపయినా తనవి తీరా చూస్తుండిపోవచ్చు. ఈ లోయ ఈ మధ్య ‘గ్రాండ్ క్యాన్యాన్ ఆఫ్ ఇండియా’ అని బాగా ప్రచారంలోకి వచ్చింది. దానితో గండికోట మంచి పర్యాటక కేంద్ర మయింది. దీని ప్రభావం ఇక్కడి మైలవరం డ్యాం మీద పడక పోవడమే ఆశ్చర్యం. డ్యామ్ ను ఒక విహార కేంద్రంగా మార్చాలన్న తపన ఏ మాత్రం ప్రభుత్వాలకు లేదని డ్యామ్ ను సందర్శిస్తే అర్థమవుతుంది. ఒక వేళ ఎపుడయినాప్రయత్నాలు సాగినా ఇపుడలాంటి ఛాయలేమీ లేవు అక్కడ

ఇంత నిర్లక్ష్యమా…

డ్యామ్ సమీపాన పెన్నానది ఒడ్డు ఒక గెస్ట్ హౌస్ ను ఎపుడో 1970 దశకంలో డ్యాం నిర్మిస్తున్నపుడే కట్టారు. డ్యాం బ్యాక్ వ్యాటర్స్ లో అనేక గ్రామాలు మునిగిపోయాయి. ఆ ఊర్లలో ఉన్న ఆలయాల్లోని శిల్పాలను, విగ్రహాలను సేకరించారు. అంతేకాదు, డ్యాం కడుతున్నపుడు దొరికిన కళాఖండాలను కూడా తీసుకువచ్చారు. వీటిన్నింటిని ప్రదర్శించేందుకు ఒక మ్యూజియం కూడా కట్టారు. అందులో భద్రపరచానికి వీళ్లేని వాటిని ఒపెన్ ఎయిర్ మ్యూజియంలాగా చూట్టూర నిలబెట్టారు. వీటి చుట్టూ కంచె వేశారు ఎపుడో…ఇప్పుడది విరిగిపోయింది. ఈ మ్యూజియం ఒక విశేషమయితే,దీని పక్కనే మరొక విశేషం ఉంది. అదొక చిన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. దానికి ‘సింఫనీ ఇన్ స్టోన్’ అని పేరు పెట్టారు. తెలుగులో ఏమనవచ్చు.రాతి వాద్య గోష్టి అనొచ్చా. ప్రకృతి శక్తులు కొండ రాళ్లమీద, బండల మీద శిల్పుల్లాగా పనిచేసి వాటిని అద్భుతమయిన కళాఖండాలుగా మార్చడం ఇక్కడ చూడవచ్చు. శక్తుల వల్ల రాళ్లు, బండలు రకరకాల జంతువుల ఆకారాలు తీసుకున్నాయి.ఇక్కడి రాళ్లలో ఎలుగుబంటు ఉంది.కుందేలు , సీల్ ఉన్నాయి. పెలికాన్ ఉంది. వీణ వంటి కొన్నివాయిద్య పరికరాల రూపం కూడా తీసుకున్నాయి. ఈ డ్యామ్ కు సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పని చేసిన కె రామకృష్ణయ్య ఈ ప్రాజక్టు పరిసరాల నుంచి ఎంతో శ్రమకోర్చి వీటిని సేకరించారు. ఎంతో కళా కృష్ణ ఉంటే తప్ప ఇలాంటి రాళ్లు రెప్పలలో కళా ఖండాలు చూడటం కష్టం. మామూలు కళ్లతో వాటిని చూడలేము. ఇలాంటి కోణాలు ప్రత్యేక దివ్యదర్శనం ఉన్నవాళ్లకే కనబడతాయి. ఇలా రాళ్లు రెప్పలలో ఈయన అందమయిన సహజ కళా ఖండాలను దర్శించారు. సేకరించారు. వీటిని చూస్తుంటే ఎవరో ఎపుడో ‘ప్రకృతి ఒక చిత్ర శాల ,ప్రకటీకృత భావలీల’ అన్న మాట గుర్తుకొచ్చింది. ఇలా రామకృష్ణయ్య సేకరించిన వాటిని ఆయనో మరెవరో ఒక ‘సింఫనీ ఇన్ స్టోన్ అని పేరుపెట్టి ఒక చిన్న ప్ర కృతి చిత్రశాలను ఏర్పాటు చేశారు. ఇది కనువిందు చేసే ప్రదేశమక్కడ. చల్లటి నీడ వుంది.పక్కనే రిజర్వాయర్ ఉంది. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. విహారయాత్రకు వస్తే ఆహ్లాదకరంగా గడిపేందుకు అనువయిన వాతావరణం ఉంది. అయితే, దీనిని ఆ స్థాయికి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు లేవు. ముందు చెప్పిన శిల్పాల మధ్య, ఇక్కడి రాతి చిత్రశాల కళాఖండాల మధ్య మనుషుల కంటే పశువులే ఎక్కవగా కనిపించాయి. పశువులు రాకుండా ఇక్కడి భద్రతా ఏర్పాట్లు లేవు. కంచె విరిగి పోయింది కాబట్టి పశువుల యథేచ్చగా విగ్రహాల మధ, ఈ చిత్ర శాల సహజ కళా ఖండాల మధ్య తిరుగుతున్నాయి. ఆలనాపాలన లేకపోవడంతో శ్రీరామకృష్ణయ్య సేకరించిన సహజ శిల్పాలు నాశనమవుతున్నాయి. కొద్ది రోజల్లో అవన్నీ విరిగిపోవచ్చు . లేదా దిక్కెవరూ లేరు కాబట్టి ఇంట్లో షోకేస్ లో పెట్టుకోవచ్చని ఎవరైనా చంకన పెట్టుకుని పోవచ్చు. రెండూ సాధ్యమే. నిజానికి ఇక్కడ కావలసినన్ని నీళ్లున్నాయి, విశాలమయన ఆవరణ ఉంది. ఆవరణ చట్టూ ప్రహరీ ఉంది. ఆవరణలోనీడనిచ్చే భారీ వృక్షాలున్నాయి. ఇక్కడ పచ్చిక పెంచి అందంగా తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని విజ్ఞాన యాత్రా కేంద్రంగా, విహారయాత్ర కేంద్రంగా మార్చవచ్చు. అలాంటిది ఇపుడయితే జరగడం లేదు. ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం చూస్తే గుండె తరుక్కుపోతుంది.

ప్రభుత్వ పురాతత్వ శాఖ వాళ్లు శిధిలాలను భద్రపరిచేందుకు, ప్రదర్శించేందుకు అందంగా కట్టిన మ్యూజియం కూడా పతనావస్థలో ఉంది. ఇక్కడి మొత్తం వ్యవస్థ చరిత్ర పట్ల మనకున్న గౌరవం ఏ పాటితో చెప్పేందుకు ఒక చక్కటి నిదర్శనం.

ఇక్కడి ఉన్నఅతిధి గృహాన్ని ఎపుడో మూసేశారు. ఇది తెరిచి ఉన్నరోజుల్లో ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుల చేలాలు పగలు, రాత్రితేడా లేకుండా మందు కొట్టే వాళ్లు. వాళ్లని ప్రశ్నించడం కష్టం. అందురూ పేరున్న రాజకీయ నాయకుల పేరు చెప్పుకుని చొరబడిన వాళ్లే. మందుబాబులకు గెస్ట్ హౌస్ నెలవు కావడంతో మహిళలు అభద్రతగా భావించారు. కుటుంబాలతో సాగుతూ వచ్చిన విహారయాత్రలు ఆగిపోయాయి. దీనితో ఇది దిక్కుదివాణం లేకుండా పోయింది. వల్లకాడులా ఉంది. గెస్ట్ హౌస్ భూత్ బంగళాలాగా కనిపిస్తింది. రిజర్వాయర్ లోకి ప్రవేశించేందుకు సిబ్బంది కోసం ఒక గేట్ ఉంది. అక్కడి ప్రమాదం అనే హెచ్చరిక ఉంది గాని గేట్ ఎపుడూ తెరిచే ఉంటుంది.

మొత్తానికి ఒక మజిలీగా చేసుకుని చూడదగ్గ ప్రదేశం మైలవరం ప్రాజక్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here