రాష్ట్రపతికి అధీర్ రంజన్ క్షమాపణ లేఖ..

0
2

కాంగ్రెస్ నాయకులు అధీర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. పదవిని ఉద్దేశించి తప్పు పదం వాడానని, నోరు జారడం వల్లే ఇలా జరిగిందని, తన క్షమాపణలు అంగీకరించమని లేఖలో పేర్కొన్నారు. కాగా ఆయన రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాష్ట్రపత్నీ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్‌లో పెద్ద దుమారం చెలరేగింది. ఉభయ సభల్లో బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ మొత్తానికి దిగి వచ్చారు. రాష్ట్రపత్నీ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. పొరపాటున నోరు జారానని, తన క్షమాపణల్ని అంగీకరించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ” మీ పదవిని ఉద్దేశిస్తూ తప్పుగా పదాన్ని ఉపయోగించినందుకు నా విచారం వ్యక్తం చేయడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. నోరు జారడం వల్లే ఇలా జరిగింది. నేను క్షమాపణలు కోరుతున్నాను. దానిని అంగీకరించమని అభ్యర్థిస్తున్నాను” అని లేఖలో రాశారు.

అధీర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి చేసిన రాష్ట్రపత్నీ వ్యాఖ్య రాజకీయ దుమారానికి తెర తీసింది. ఈ విషయంపై లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ నేతలు నిరసనలు చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతిని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అధీర్ రంజన్ చౌదరిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ముర్ముకు జరిగిన అవమానాన్ని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కూడా ఆమోదించారని స్మృతి ఇరానీ విమర్శించారు.

అలాగే రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పలువురు బీజేపీ నాయకులు, మంత్రులు సైతం అధీర్ రంజన్, కాంగ్రెస్ పార్టీ కూడా ఆదివాసీ రాష్ట్రపతిని కించపరిచారని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. కాగా అధీర్ రంజన్ కూడా బీజేపీ నేతలను విమర్శించారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద బీజేపీ నాయకులు తనను అరెస్ట్ చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. నిజానికి కేంద్రం గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here