రైతులకు సాగు అనుమతి పత్రాలు జారీ…

0
4
 ఆక్వాసాగు చేస్తున్న రైతులకు సాగు అనుమతి పత్రాలు జారీచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ఆదేశించారు. ఆక్వాసాగుపై రెవిన్యూ, మత్స్యశాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఆమె సమావేశం నిర్వహించారు.

ఆక్వాసాగు చేస్తున్న రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బాపట్ల జిల్లాలో సుమారుగా 15 వేల ఎకరాలలో ఆక్వాసాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు లేవన్నారు. సంబంధిత భూములకు రిజిస్ట్రేషన్ కూడా జరుగలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేక పోతున్నారని, వారు పండించే ఆక్వాసాగు విదేశాలకు ఎగుమతి చేయలేక పోతున్నారని ఆమె వివరించారు. ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు రైతులకు చేరాలంటే వారు సాగు చేసే భూములకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలన్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 31వ తేదీలోగా ఆక్వా రైతుల సర్వే, సాగు అనుమతి పత్రాల జారీ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల పరిధిలోని వి.ఆర్.ఓ.లు, ఫిషరీస్ అసిస్టెంట్లు సంయుక్తంగా ఆక్వా రైతుల పేర్లను ఆన్ లైన్ నమోదు చేయాలన్నారు. తక్షణమే తీర ప్రాంతాల గ్రామాలలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టా భూములు, ప్రభుత్వ భూములలో ఆక్వాసాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి తహసిల్దార్లు పరిశీలన చేయాలన్నారు. భూముల గుర్తింపు, హక్కు పత్రాల జారీ పై తహసిల్దార్లు చురుగ్గా పనిచేయాలని ఆమె సూచించారు.

సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, మత్స్యశాఖ జె.డి. పి. సురేష్, బాపట్ల ఆర్.డి.ఓ. జి. రవీందర్, తహసిల్దార్లు, మత్స్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here