రొట్టెల పండుగకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

0
3

రెండు సంవత్సరాల విరామానంతరం జరుగుతున్న బారా సాహెబ్ దర్గా రొట్టెల పండుగ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవసిందిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అధికారులను ఆదేశించారు.

శనివారం ఉదయం బారా సాహెబ్ దర్గా ప్రాంతంలో రొట్టెల పండుగ ఏర్పాట్లు గురించి మంత్రి కాకాణి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

తొలుత మంత్రి బారా సాహెబ్ దర్గాను సందర్శించి పెద్దల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ చైర్మన్ షాజహాన్ మంత్రికి సంప్రదాయ పగడి (తలపాగా) చుట్టారు.

ఆగస్టు 9 నుండి 13 వరకు జరిగే రొట్టెల పండుగకు వివిధ జిల్లాల నుండి లక్షలాదిమంది ప్రజలు భక్తి విశ్వాసాలతో హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులకు మంత్రి కాకాణి సూచించారు. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలన్నారు.

మంత్రి కాకాణి శాఖల వారీగా సమీక్షిస్తూ, శానిటేషన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దర్గా ప్రాంతంలో నిరంతరం 24/7 తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు లభించే ప్రదేశంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న దృష్ట్యా, రాత్రి వేళల్లో పగలు అనిపించేవిధంగా లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. స్వర్ణాల చెరువు ఘాట్ ల వద్ద బారికేడ్లు, సరిపోవు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు. రెస్క్యూ టీమ్ లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. దర్గా ప్రాంతంలో, నెల్లూరు నగరంలో పండుగ రోజుల్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. 104,108 వాహనాలతో పాటు డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని వైధ్యాధికారులకు సూచించారు. స్వర్ణాల చెరువులో నీరు సమృద్ధిగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. 5 రోజులు జరిగే పండుగలో లోపాలు తలెత్తితే వెంటనే సరిచేసుకునే యంత్రాంగం సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో ఎటువంటి అలసత్వాన్ని సహించేదిలేదని, అధికారులoదరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ తో గత రెండు సంవత్సరాలుగా రొట్టెల పండుగను నిర్వహించు కోలేకపోయామని, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పించి, వారు సంతృప్తిగా వెనుదిరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

నిర్వాహక కమిటీ చైర్మన్ షాజహాన్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తూ సహకారం అందిస్తున్నారని, అదేవిధంగా అధికారులు కూడా తమ వంతు సహకారం అందిస్తూ పనులు పూర్తి చేస్తున్నారని తమ సంతోషం వెలిబుచ్చారు.

ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి జయ కిషోర్, నగర పాలక సంస్థ కమిషనర్ హరిత, ఏ ఎస్ పి చౌడేశ్వరి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కనక దుర్గా భవాని, స్థానిక కార్పొరేటర్ వాసంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here