కాశ్మీర్లో వరద బీభత్సం
జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం చేశాయి. రాంబన్ జిల్లాలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. రెప్పపాటులో ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరి కొంత మంది ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. కొంత మంది ఇళ్ల పైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులను షమీమా బేగం, రోజియా బేగం గుర్తించారు. వారి కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా మెహర్‌లో గురువారం (ఆగస్టు 11) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌ను గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షం వణికిస్తోంది. గురువారం ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. దీంతో జల ప్రళయం విరుచుకుపడింది. అలాంటి ఆకస్మిక వరదల్లో పలువురు గల్లంతయ్యారు. భారీ వర్షాలు, వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. వరద ప్రవాహంలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు సంబంధం తెగిపోయి, జనజీవనం స్తంభించిపోయింది.
