వరదల నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్….

0
5
  • ఏలూరు జిల్లాలో జులై నెలలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. వరద నష్టాలపై కేంద్రం నియమించిన అధికారుల బృందం బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. మొదటిగా పోలవరం సి.డబ్ల్యూ.సి. కార్యాలయం వద్ద గల నెక్ లెస్ బండ్ వద్ద గోదావరి గట్టును పరిశీలించారు. వరద సమయంలో గోదావరి గట్టు పటిష్ఠపరచిన విధానాన్ని బృందం పరిశీలించింది. అనంతరం వరద నష్టాలపై సమాచార శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను బృందం తిలకించింది. అనంతరం యడ్లగూడెం చేరుకొని గోదావరి గట్టు ను పరిశీలించింది. అక్కడ నుండి కోటరామచంద్రపురం చేరుకున్నారు. అనంతరం కోటరామచంద్రాపురం నుండి వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము, తోటకూరుగొమ్ము గ్రామాలకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు, ఇతర జిల్లా అధికారులతో కలిసి బోటుపై ప్రయాణించి, ఆయా ప్రాంతాలను సందర్శించి, వరద నష్టాల వివరాలను తెలుసుకున్నారు.

  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జులై నెలలో వచ్చిన వరదల కారణంగా జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని బృందం సభ్యలకు తెలియజేయడం జరిగిందన్నారు. వరదల కారణంగా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయన్నారు. వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 8 వేలకు పైగా ఇళ్ళు దెబ్బతిన్నాయని, పశువుల నష్టం జరిగిందని, వీటితోపాటు రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు.
  • పంట నష్టం పెద్దగా లేదన్నారు. వీటిలో కుక్కునూరు, వేలేరుపాడులలో 3300 లకు పైగా పూరిపాకలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీ మేరకు కుటుంబానికి వీటికి సంబంధించి 10 వేల రూపాయల పరిహారం చెల్లింపులు ప్రాసెస్ లో ఉన్నాయన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో 2 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయన్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేయడం జరిగిందన్నారు. రేపాకగొమ్ము, కొయిదా వంటి గ్రామాల నీటి మునగడంతో జనరేటర్ ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు. పోలవరం నెక్ లెస్ బండ్ ను, గూటాల వద్ద గోదావరి గట్టుకు పటిష్టపరిచే పనులు చేపట్టామన్నారు. ఈ వివరాలను కేంద్ర బృందం సభ్యులకు తెలియజేయడం జరిగిందన్నారు. వేలేరుపాడు మండలంలోని నీటమునిగిన తోటకూరగొమ్ము, రేపాకగొమ్ము,నార్లవరం , తిరుమలాపురం గ్రామాలను కేంద్ర బృందం సభ్యులను బోట్ లో తీసుకువెళ్లి చూపించమన్నారు.
  • పోలవరం ప్రాజెక్ట్ 41వ కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు 70 కోట్ల రూపాయల ఖర్చుతో పునరావాస కాలనీ నిర్మించడం జరిగిందని, సెప్టెంబర్ లోగా వారికి పూర్తి స్థాయిలో పునరావాస ప్యాకేజ్ అందించిన తరువాత పునరావాస కాలనీకి తరలిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ కి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నదికి వరద కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారని, ప్రస్తుతం 10 నుండి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు భద్రాచలం నుండి విడుదల అవుతున్నదన్నారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైతే ప్రమాదకరమని, వరద నీరు మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. .

  • కేంద్ర బృందంలో హైద్రాబాద్ లోని కేంద్ర వ్యవసాయం,సహకార, రైతు సంక్షేమ శాఖ జ్యూట్ విభాగంలో ని డైరెక్టర్ కె. మనోహరన్, హైద్రాబాద్ లోని కేంద్ర జలసంఘం లోని జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ పి.దేవేందర్, ఢిల్లీ కి చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ సోని సభ్యులుగా ఉన్నారు.
    కేంద్ర బృందం వెంట జిల్లా పరిషత్ సీఈఓ కె. రవికుమార్, ఆర్డీఓలు కె. పెంచల్ కిశోర్, ఝాన్సీరాణీ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here