విజృంభిస్తున్న లంపీ వైరస్.. 

0
8

 రాజస్థాన్‌లో 12 వేలకుపైగా మూగ జీవాలు మృతి:

లంపీ వైరస్ విజృంభిస్తోంది. ఈ చర్మ వ్యాధి కారణంగా వేలాది సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయి. ఒక్క రాజస్థాన్‌లోనే ఇప్పటి వరకు ఈ లంపీ వైరస్ కారణంగా 12,800 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు నివారణ చర్యలను చేపట్టింది. అందులో భాగంగా పశు సంతలను నిషేధించింది.

రాష్ట్రంలో ఆగస్ట 10వ తేదీ వరకు శ్రీ గంగానగర్‌లో గరిష్టంగా 2,511 ఆవులు చనిపోయాయి. తర్వాత బార్మర్‌లో 1,619, జోధ్‌పూర్‌లో 1,581, బికనీర్‌లో 1,156, జాలోర్‌లో 1,150 మరణాలు సంభవించాయి. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. “వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఐదు జిల్లాల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉంది.” అని పశుసంవర్థక శాఖ కార్యదర్శి పీసీ కిషన్‌ తెలిపారు.

గణాంకాల ప్రకారం మొత్తం 2,81,484 జంతువులు లంపీ వైరస్ బారినపడ్డాయి. ప్రస్తుతం 2,41,685 జంతువులు చికిత్స పొందాయి. ఈ మేరకు రాజస్థాన్‌లో పశువుల సంతలను నిర్వహించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే చనిపోయిన ఆవుల కళేబరాలను సురక్షితంగా పూడ్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూగ జీవాలను రక్షించేందుకు ప్రభుత్వం పశు సంవర్థక శాఖలో తాత్కాలిక సిబ్బందిని నియమిస్తుంది. 500 పోస్టుల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించేందుకు అనుమతిని ఇచ్చింది. వీరిలో 200 మంది పశువైద్యులు, 300 మంది పశువుల సహాయకులు ఉన్నారు.

అయితే ఒక రాజస్థాన్‌లోనే కాదు మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగానే ఉంది. గుజరాత్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌, ఉత్తరాఖండ్‌లలోనూ వందల సంఖ్యలో పశు మరణాలు సంభవిస్తున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.

ప్రాణాంతకమే..
ఈ లంపీ వైరస్ అనేది చర్మ సంబంధిత వ్యాధి. ఈ వైరస్ సోకిన ఆవులు జ్వరం బారిన పడతాయి. చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. వాటిపై రక్తాన్ని పీల్చే దోమలు, పురుగులు వాలి కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఈ వ్యాధి బారినపడితే బరువు తగ్గిపోతాయి. సరిగ్గా తినలేవు. శ్వాస, లాలాజల స్రావాలు కూడా మరింత ఎక్కువై పశువుల మరణానికి దారితీస్తుంది. ఇప్పటివరకు దీనికి ఎటువంటి చికిత్స లేనప్పటికి వ్యాధి నుంచి పశువులకు ఉపశమనం కలిగించేందుకు యాంటీబయోటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ వ్యాధిని అరికట్టేందుకు టీకా తీసుకొచ్చేందుకు వైద్య నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భారత వ్యవసాయ పరిశోధన మండలికు చెందిన రెండు సంస్థలు స్వదేశీ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌ను త్వరలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here