విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్‌..

0
4

పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన మూడో విడత డబ్బులను బటన్‌ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి జమచేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన మూడో విడత డబ్బులను బటన్‌ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి జమచేశారు. మొత్తం రూ.694 కోట్లను 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్‌.. ‘పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి విద్య. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. పిల్లల చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం బకాయిలను కూడా మేమే చెల్లిస్తున్నాం. ఇక విద్యారంగలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియం, బైజ్యూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టాం’.

గత ప్రభుత్వంలో వారే లాభపడ్డారు..
‘ఇంట్లో ఎంతమంది ఉన్నా అందర్నీ చదివించండి. పెద్ద చదువులు పేదలకు హక్కు. ప్రతి ఇంటినుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎల్‌లు రావాలి. అయితే మా పథకాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? గత పాలనలో రాష్ట్రంలో కేవలం ఆ నలుగురే బాగుపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంటగా ఉంటోంది’ అని జగన్‌ మండిపడ్డారు. కాగా ఏప్రిల్‌-జూన్‌ 2022 కాలానికి గానూ జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులను విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. వారం, 10 రోజుల్లోగా కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు సూచించింది. ఒకవేళ డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడత డబ్బులను నేరుగా కాలేజీలకు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here