విమానం భోజనంలో పాము తల..

0
12
snack head found in meal

విమానంలో సరఫరా చేసిన ఆహారంలో పాము తల కనిపించింది. సగం తిన్న తర్వాత క్రూ మెంబర్ దాన్ని గమనించాడు. తన చేదు అనుభవాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టర్కీకి చెందిన సన్ ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు.

క్కడైనా పాము కనపిస్తే వణుకు పుడుతుంది. మరి మీరు తింటున్న అన్నం కంచంలో పాము తల కనిపిస్తే..?! అది కూడా సగం భోజనం తిన్నాక జరిగితే.. ఇక కడుపులో దేవినట్టు అనిపిస్తుంది కదా! విమానంలో ఓ క్రూ మెంబర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఫ్లైట్‌లో అతడికి సరఫరా చేసిన ఆహారంలో పాము తల కనిపించింది తన చేదు అనుభవాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టర్కీకి చెందిన సన్ ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది.

సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానం జూలై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు బయల్దేరింది. విమానంలోని క్రూ సిబ్బంది ఒకరు లంచ్ చేస్తుండగా.. అతడికి అందించిన ఆహారంలో ఆలూ, ఆకుకూరలతో చేసిన కర్రీతో పాటు పాము తల కనిపించింది. దాన్ని పరిశీలనగా చూసి పాము తల అని నిర్ధారించుకున్న తర్వాత తాను ఎంతో భయపడ్డానని సదరు ఉద్యోగి వెల్లడించాడు. తమకు ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ ఘటనపై సన్‌ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఆహారం సరఫరా చేసే వ్యక్తికి నోటీసులు జారీ చేశామని, కాంట్రాక్టును తాత్కాలికంగా రద్దు చేశామని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

‘30 ఏళ్ల విమాన సేవల్లో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన ప్రయాణాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ ఘటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని సన్‌ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉండగా.. విమానంలో సరఫరా చేసిన భోజనంలో పాము తలకు సంబంధించి వార్తలను సదరు క్యాటరింగ్ సంస్థ ఖండించింది. అవి సరైనవి కాదంది. వంట చేసేటప్పుడు విదేశీ వస్తువులు ఏవీ వాడలేదని వెల్లడించింది. ఆ ఆహారాన్ని 280 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వండుతారని.. కానీ, ఆ పాము తల తాజాగా కనపడుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోనూ కొన్ని రోజుల కిందట ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు ఎయిర్ పోర్టులో కొనుగోలు చేసిన చికెన్ సలాడ్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here