వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే నాకు రాజకీయ భిక్ష…?

0
8
 • నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్ర.
  – వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే నాకు రాజకీయ భిక్ష.
  – ఆ విశ్వాసాన్ని మరిచే వ్యక్తిని కాదు.
  – తప్పుడు ప్రచారం ఎక్కువ కాలం మనలేదు
  .
  – ఉమ్మడి ఏపీలో చేనేత మంత్రిగా పనిచేశాను కాబట్టే ట్వీట్‌.
  – దానికి పార్టీ మారుతున్నారంటూ వ్యాఖ్యానించడం సరికాదు.
  – కేటీఆర్‌ ట్వీట్‌కు పవన్‌ స్పందించారు…మరి కేసీఆర్‌పార్టీకి మద్దతుగా పవన్‌ ఉన్నట్లా.
  – గిద్దలూరులో రెండు మూడురోజుల్లోనే గడపగడపకు ప్రారంభం.
  – విలేకరుల సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి
  .
  ఒంగోలు:
  తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా వారి చానళ్లకు రేటింగ్‌ పెంచుకోవాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఒంగోలు శాసనసభ్యులు, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
 • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ మారే విషయమై సమావేశమైనట్లు ప్రసారం చేసిందని, కానీ అదే ఛానల్‌కు సంబంధించిన పత్రికేమో గిద్దలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించినట్లు రాసిందన్నారు. దీని ద్వారా అసలు వారు ఏం చెప్పదలుచుకున్నారనే దానిపై వారికైనా అవగాహన ఉందా లేదా అనేది తేల్చుకోవాలన్నారు.
 • వైఎస్సార్‌ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆ విశ్వాసాన్ని మరిచే వ్యక్తిని తాను కాదన్నారు. అందువల్లే ఆయన మరణించిన వెంటనే మంత్రి పదవిని సైతం వదులుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచానన్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.చేనేతలకు సంబంధించి పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేస్తే తాను స్పందించడం జరిగిందన్నారు. అందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో తాను చేనేత శాఖామంత్రిగా పనిచేశానని, అప్పట్లో చేనేతలను ఆదుకునేందుకు రు300కోట్ల రుణాలను రద్దుచేయడం జరిగిందన్నారు. నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదికి రు24వేలు నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేతలకు ఇచ్చి ఆదుకుంటున్నారని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించేందుకే తాను స్పందించడం జరిగిందన్నారు. దీనిని వక్రీకరించిన చానళ్లు కేటీఆర్‌ ట్వీట్‌కు పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తే కేసీఆర్‌ పార్టీకి మద్దతుగా పవన్‌ వ్యవహరిస్తున్నారని కూడా అనకపోవడానికి కారణం ఏమిటో ప్రజలు గ్రహించాలన్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్ర చేస్తున్నారన్నారు.
 • పార్టీలో ఆదినుంచి ఉన్న కార్యకర్తలకు న్యాయం జరగాలనేదే తన ఉద్దేశ్యమని, ఇందుకు తాను ఎందాకైనా పోరాడతానన్నారు. ఈ క్రమంలో కొన్ని చానళ్లు తనను రెచ్చగొట్టాలని కూడా యత్నిస్తున్నాయన్నారు. తనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 22 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యతను అప్పగించారని, వాటిపైనే తన దృష్టి ఉందన్నారు. అయితే గుప్తాలాంటివారికి రఘురామకృష్ణంరాజుతోపాటు మరికొంతమంది నిధులు ఇచ్చి మరీ విమర్శింపజేస్తున్నారని , జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే జగన్‌ దృష్టికి కూడా తీసుకువెళతానన్నారు.

 • గిద్దలూరు నియోజకవర్గంకు సంబంధించి రమణారెడ్డితోపాటు ఆ నియోజకవర్గంలోని నాయకులు అందరితో సమీక్షించానని, అందరు ఏకకంఠంతో రెండు మూడు రోజుల్లో గడపగడపకు కార్యక్రమం నిర్వహించేందుకు అంగీకరించారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి రు81వేల ఓట్ల మెజార్టీ 2019 ఎన్నికల్లో వచ్చిందని, అందుకు ఎంతోమంది నాయకులు చేసిన కృషే కారణమన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కొద్దిపాటి పదవులు మాత్రమే ఉంటాయని, ఈ నేపథ్యంలో అందరికీ పదవులు ఇవ్వడం ఏ ఎంఎల్‌ఏకు కూడా అవకాశం ఉండదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని కూడా అందరు సర్దుబాటు చేసుకుని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారన్నారు.
 • ఎయిర్‌పోర్టులో సుబ్బారావు గుప్తా ఏ పార్టీలో ఉన్నాడో కూడా అతనికే తెలియని పరిస్థితి అని , అటువంటి వ్యక్తి గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. గుప్తాలాంటి వారికి నిధులు అందించి మరీ తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తుంది ఎవరనేది తనకు తెలుసన్నారు. అయితే ఎయిర్‌పోర్టులో గుప్తా కలవడం , వినతిపత్రం అందించడం అనేది పెద్దగా సెక్యూరిటీ ఉండని పరిస్థితిలో జరిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు.
 • ఎంపీ గోరంట్ల మాధవ్‌ విషయానికి సంబంధించి పార్టీ , ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చాయన్నారు. విచారణ జరుగుతుందని, నిజమని తేలితే తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. అయితే అది మార్ఫింగ్‌ అని తేలితే మాత్రం ఎవరు మార్ఫింగ్‌ చేశారో వారిపై చర్యలు ఉంటాయని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here