శివుడిపై పాట పాడిన ముస్లిం గాయని..

0
5

మండిపడుతున్న మతపెద్దలు

యూట్యూబ్ సంచలనం, ప్రముఖ గాయనీ ఫర్మానీ నాజ్ హిందూ దేవుడు శివుడిపై గానం చేశారు. శివుడిని స్తుతిస్తూ పాట పాడడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. శివుడిపై ఆమె పాట పాడడంపై ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాం మతానికి అది విరుద్ధమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫర్మానీ నాజ్ స్పందించారు. సంగీతాన్ని, మతాన్ని మిలితం చేయవద్దని అభ్యర్థించారు. గతంలో కూడా అనేకమంది ప్రముఖ సింగర్లు హిందూ పాటలను పాడిన సంగతిని గుర్తు చేశారు.

యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టించి.. తనకంటూ ఓ ఫేమ్‌ను క్రియేట్ చేసుకున్న ఫర్మానీ నాజ్ శివుడిని స్తుతిస్తూ ఓ పాట పాడారు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఫర్మానీ నాజ్ ముస్లిం పెద్దల నుంచి విమర్శలకు గురవుతున్నారు. శివుడిపై ఫర్మానీ నాజ్ హర హర శంభూ అంటూ అనే పాట పాడడమే కాకుండా జూలై 24న ఫర్మానీ నాజ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటకు ఇప్పటి వరకు 600,000 మంది వీక్షించారు. కానీ దీనిపై మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇస్లాం విరుద్ధమైన పద్ధతులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

షరియా చట్టం ప్రకారం హిందూ దేవుళ్లపై పాడటానికి అనుమతి లేదని దేవ్‌బంద్‌కు చెందిన మత గురువు ముఫ్తీ అసద్ ఖాస్మీ అన్నారు. ఏ పాటైనా పాడటం ‘హరామ్’ లేదా ఇస్లాంలో నిషిద్ధమని ఆయన సూచించారు. ముఖ్యంగా ముస్లింగా భావించే మహిళ ఇలాంటి పాటలకు దూరంగా ఉండాలన్నారు. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో భక్తులు తమ శివుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. అలాంటి పవిత్రమైన శ్రావణ మాసంలో స్టూడియోలో రికార్డ్ చేసిన భక్తి పాటను ఫర్మానీ నాజ్ పాడి పోస్ట్ చేయడంపై వివాదం చెలరేగింది.

అయితే ఈ వివాదంపై ఫర్మానీ తనదైన స్టైల్లోనే స్పందించారు. “ఆర్టిస్ట్‌కు మతం లేదని ఆమె అన్నారు. గానం లేదా సంగీతానికి మతం లేదు. సలీమ్ మహమ్మద్ రఫీ వంటి దిగ్గజాలు కూడా భజనలు లేదా హిందూ భక్తి గీతాలను ఆలపించారు. సంగీతంలో మతాన్ని మిలితం చేయవద్దని నేను అందరికి అభ్యర్థిస్తున్నాను.”

ఫర్మానీ నాజ్..?
ఫర్మానీ నాజ్ ముజఫర్‌నగర్‌‌లో ప్రసిద్ధ సింగర్. యూట్యూబ్‌లో ఆమెకు ఎంతోమంది ఫాలోవర్లు ఉన్నారు. ఫర్మానీ నాజ్ యూ ట్యూబ్ ఛానల్‌కు 3.84 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సింగింగ్ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఆమె పాల్గొన్నారు. దాంతో ఆమె హోదా మరింత పెరిగింది. ఫర్మానీ 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె భర్తకు విడాకులు ఇచ్చారు. తర్వాత నుంచి గాన వృత్తిలో మరింతగా రాణిస్తున్నారు. అయితే ఫర్మానీ తన అత్తమామల దగ్గరే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఫర్మానీ నాజ్‌కు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ ఉంది. ఆమె వైద్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here