సాంబార్ గిన్నెలో పడి వ్యక్తి మృతి

0
8

మధురైలో ఓ వ్యక్తి సాంబార్ గిన్నెలో పడి మృతి చెందాడు . గ్రామ దేవత ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సాంబారు అన్నం నైవేద్యంగా పెట్టి భక్తులకు వితరణ చేసేందుకు పెద్ద గిన్నెలో సాంబార్ కాస్తున్నారు. అలాంటి గిన్నె వద్దకు వచ్చిన వ్యక్తి వెనక్కి తూలుతూ అందులో పడిపోయాడు . అతడిని రక్షించేందుకు అక్కడున్న వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరుగుతున్న సాంబార్ ఒంటి మీద పడి పలువురు గాయపడ్డారు. 65 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతూ బాధితుడు 4 రోజుల తర్వాత మృతి చెందాడు. ఈ మరణం అతడి కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని మధురై జిల్లా పలంగానట్టిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడు మద్యం మత్తులో తూలుతూ, గోడ అనుకొని సాంబార్ గిన్నె వైపు వచ్చినట్లు తెలుస్తోంది.

జూలై 29 తమిళనాడు వాసులు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆడివెల్లి’ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. బోనాల పండగ తరహాలో గ్రామ దేవతల ఉత్సవమిది. మధురైలో పలంగానట్టిలోనూ గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలకు గ్రామస్థులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం చేసేందుకు పెద్ద ఎత్తున వంటలు చేస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

అన్నదానం కోసం భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకొని దానిపై, కూర్చోబోయి మరుగుతున్న సాంబార్‌లో పడిపోయాడు ముత్తుకుమార్. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ క్రమంలో కింద ఒలికిన సాంబార్‌లో కొంత మంది జారిపడ్డారు. మరికొంత మందిపై వేడి వేడి సాంబార్ పడింది. చివరికి సాంబార్ గిన్నెను పొయ్యి మీద నుంచి కిందకు తోసేశాక గానీ.. ముత్తు కుమార్‌ను రక్షించారు. సాంబార్ గిన్నెను కిందకి బలంగా నెట్టడంతో కొంత మందిపై వేడి వేడి సాంబార్ పడి తీవ్రంగా గాయపడ్డారు.

ముత్తుకుమార్‌ను రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 65 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతూ అతడు మంగళవారం మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here