సినీ నటి జయసుధకు బీజేపీ ఆహ్వానం!

0
7

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. చేరికలపై ఫోకస్ పెట్టింది. తమతో చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తోన్న ఈటల రాజేందర్‌ పదే పదే చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బీజేపీ వైపు చూసే నేతల సంఖ్య పెరుగుతోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరగా.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి కొద్ది రోజుల్లో అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.చేరికల ద్వారా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన నాయకత్వం.. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరంపైనా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వైఎస్ హయాంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేసిన జయసుధ.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు ఆమె వైఎస్సార్సీపీలో చేరారు. కానీ ఆమె రాజకీయంగా అంత యాక్టివ్‌గా లేరు.జయసుధకు రాజకీయ అనుభవం ఉండటంతోపాటు.. సికింద్రాబాద్ ప్రాంతంలో ఆమెకు ఉన్న పరిచయాలు, నియోజకవర్గం పరిధిలో క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో.. బీజేపీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించిందని భావిస్తున్నారు. ఈ నెల 21న అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అదే రోజు మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారు. అదే వేదికపై.. అమిత్ షా సమక్షంలోనే జయసుధను బీజేపీలో చేరాలని ఆహ్వానించారని తెలుస్తోంది. కాగా రాజకీయాలు, ఎన్నికల్లో పోటీ పట్ల జయసుధ అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మరి కొద్ది రోజులు ఆగితే ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటనేది తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here