కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు సీఎం జగన్. పంటుపై గోదావరి దాటిన సీఎం జగన్, ట్రాక్టర్ పై ప్రయాణించి, ఆ తర్వాత కాలినడకన వరద బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్నారు. సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పంటుపై గోదావరి దాటి అవతలి గట్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ట్రాక్టర్‌లో లంక గ్రామాలలో పర్యటనకు బయలుదేరారు. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. వశిష్ట గోదావరిలో బూరుగులంక రేవులో వరద ముంపు పరిస్థితులను అధికారులను అడిగితెలుసుకున్నారు సీఎం జగన్. వర్షంలోనే సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది
అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న సీఎం జగన్ బాధితులతో మాట్లాడారు. వరద సమయంలో తాను పర్యటిస్తే అధికారులు తన చుట్టూ తిరిగేవాళ్లని, బాధితులకు సహాయం అందించేందుకే అధికారులకు వారం టైం ఇచ్చి వచ్చానని సీఎం జగన్ అన్నారు. అందరికీ సాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం బాధితులతో అన్నారు. జి. పెదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వర్షాకాలం ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం అన్నారు. బాధితులందరికీ సాయం ఎలా అందుతోందని, అధికారులు, వాలంటీర్ల పని తీరుపై సీఎం జగన్ స్వయంగా అడిగి తెలుసుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నారు.
బాలుడికి పెన్ గిఫ్ట్
సీఎం జగన్ పర్యటనలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో ఆమె కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఆ బాలుడు సీఎం జేబులోని పెన్ను తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన సీఎం.. ఆ బాలుడికి తన పెన్ బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అలాగే వరద బాధిత శిబిరాల్లో బాగా చూసుకున్నారా అని సీఎం అడిగి తెలుసుకున్నారు.
రేపు అల్లూరి, ఏలూరు జిల్లాలో పర్యటన
రేపుసీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలలో పర్యటించున్నారు. రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు చేరుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.