సుప్రీం కోర్టులో రఘురామకు చుక్కెదురు..

0
10

ఎంపీ రఘురామకు ఎదురు దెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై రఘురామ కృష్ణంరాజు సిబ్బంది, తనయుడు దాడి కేసుపై సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ సిబ్బంది, తనయుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని పిటిషనర్ తరపు లాయర్ కోరారు. ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కదా.. విచారణ జరనివ్వాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

మరోవైపు రఘురామ కృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ, ఆయన కుమారుడు భరత్‌.. తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను ఫైల్ చేశారు.. కానీ ఆయన దాఖలు చేసుకున్న క్వాష్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

గత నెలలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లోని ఇంటి దగ్గర కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండటంతో తెలుగు రాష్ట్రాల పోలీసులు భద్రత ఏర్పాట్లలో భాగంగా.. ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వివిధ సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు.. ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌‌కు స్పాటర్స్‌గా పంపించారు.. వారు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచారు.

ఈ క్రమంలోనే అనంతపురానికి చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషా హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ గేటు దగ్గర స్పాటర్‌గా వెళ్లారు. గచ్చిబౌలిలోని బౌల్డర్‌ హిల్స్‌లో ఉన్న ఎంపీ రఘురామ నివాసానికి సమీపంలో బాషా కనిపించారు. అతడి తీరు అనుమానంగా ఉండటంతో రఘురామ కుటుంబ సభ్యులు కొందరు, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో కలసి వచ్చి తనపై దాడి చేశారని ఫరూక్‌ ఆరోపించారు. తాను విధి నిర్వహణలో ఉంటే ఎంపీ కుటుంబసభ్యులు, సిబ్బంది, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు దాడి చేసి గాయపరిచారని కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషా ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు. దీనిపై రఘురామ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను కొట్టివేశారు. రెండు కోర్టుల్లో పిటిషన్‌లను కోర్టులు కొట్టివేయడంతో ఎంపీకి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here