సొంత పార్టీ నేతలు చేసిన కుట్ర..

0
3

శిందే సర్కార్ కుప్పకూలిపోవటం ఖాయం, మా నాన్న చేసిన తప్పు అదే-ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు

సొంత పార్టీ నేతలు చేసిన కుట్రను పసిగట్టలేకపోవటమే తన తండ్రి చేసిన తప్పు అని ఆదిత్య ఠాక్రే అన్నారు. త్వరలోనే శిందే ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.

మధ్యంతర ఎన్నికలు వస్తాయ్..

శివసేన నేత, ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తొందర్లోనే ఈ సర్కార్ కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. శివసంవాద్ యాత్రలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. కొందరు నేతలు శివసేనను నమ్మించి ద్రోహం చేశారని మండిపడ్డారు. తన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఈ కుట్రను కనిపెట్టకపోవటమో ఉద్ధవ్ ఠాక్రే చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. “అయినా పర్లేదు. మేము శివసేన కార్యకర్తల్ని నమ్ముతాం. వారిని కాకపోతే ఇంకెవరిపై మాకు నమ్మకముంటుంది” అని అన్నాడు ఆదిత్య ఠాక్రే. ఎవరైతే తమ పార్టీ నుంచి బలవతంగా శిందే శిబిరానికి వెళ్లిపోయారో, వాళ్లు మళ్లీ తమ వైపు రావచ్చని వెల్లడించారు. వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీళ్లంతా కలిసి తిరిగి ఉద్ధవ్ ఠాక్రేను అధికారంలోకి తీసుకురావచ్చని అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, అదను చూసి కావాలనే ఈ కుట్ర చేశారని విమర్శించారు. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో మరోసారి శివసేనలో చీలికలు వచ్చాయి. ఇదిలాగే వదిలేస్తే పార్టీకి తీరని నష్టం తప్పదని భావించిన ఆదిత్య ఠాక్రే వెంటనే అప్రమత్తమయ్యారు. శివ సంవాద్ యాత్ర ప్రారంభించారు. 

ఈ పనేదో అప్పుడే చేసుంటే బాగుండేదిగా..

ఈ యాత్రలో భాగంగా పార్టీ క్యాడర్‌ను కలుసుకుంటున్నారు. వీలైనంత మేర కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఉంటే, పరిస్థితులు ఇంత వరకూ వచ్చేవే కావు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు సరే. కానీ మీకు 30 ఏళ్లు. అంటే ఎంత చురుగ్గా ఉండాలి. ఆయన మాస్క్ లేకుండానే పార్టీ మీటింగ్‌లకు హాజరయ్యారు. అందుకే అలా అయింది. పార్టీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము తిరుగుబాటు చేయాల్సి వచ్చింది” అని రెబల్ నేతలు కుండ బద్దలు కొడుతున్నారు. మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా ఈ సందర్భంగా స్పందించారు. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్‌ శిందేనే ముఖ్యమంత్రిని చేయాలని అధిష్ఠానం మనస్పూర్తిగా కోరుకుందని స్పష్టం చేశారు. అందుకే…దేవేంద్ర ఫడణవీస్‌కు బదులుగా ఆయనకు ఆ పదవి కట్టబెట్టారని తెలిపారు. ప్రస్తుతానికి ఉద్దవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పైగా శివసేన తమదంటే తమది అంటూ ఇద్దరూ పోటీ పడుతున్నారు. అటు ఎన్నికల సంఘం మెజార్టీ నిరూపించుకోవాలంటూ ఈ ఇద్దరికీ ఆదేశాలిచ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here