స్వాతంత్ర్యం ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ13KM నడక…

0
9
  • స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ నగరం నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమానికి వారసత్వ నడక నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బాబు శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.
  • గురువారం ఉదయం ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ట్రంకు రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఇందుకూరుపేట మండలంలో గల పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమానికి వారసత్వ నడకను నిర్వహించారు.
  • తొలుత జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారసత్వ నడక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి నగరవీధుల్లో నడిచారు. ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ విగ్రహం నుండి మొదలై ఆత్మకూరు బస్టాండు, స్టోన్ హౌస్ పేట, కిసాన్ నగర్ , నాలుగవ మైలు మీదుగా పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో డీజే ధ్వనులతో దేశభక్తి పాటలు నగరంలో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు జాతీయ పతాకం చేతబూని అలుపు సొలుపు లేకుండా ముందుకు నడిచారు. చిన్నారుల దేశభక్తి నాయకుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ క్రాస్ వాలంటీర్లు విద్యార్థులు 200 మీటర్ల జాతీయ పతాకాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించడం చెప్పుకోదగ్గ విశేషం.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 1 వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆజాదీ. కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే గురువారం వారసత్వ నడక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దాదాపు 13 కిలోమీటర్ల దూరం ఉన్న పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమానికి కాలినడకన వెళ్లడానికి వచ్చిన ప్రతి ఒక్కరు అభినందనీయులన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఈ ఉత్సవాల పట్ల మంచి స్పందన లభిస్తుందన్నారు.

  • ప్రతి ఒక్కరిలోనూ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ఉద్యమస్ఫూర్తితో ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషదాయకమన్నారు. ఈనెల 13 నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఆ రోజున ప్రతి ఇంటి మీద మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలని, జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకొని హర్ ఘర్ తిరంగా డాట్ కాం వెబ్సైట్లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నడకలో పాల్గొన్న వారందరికీ ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. వారసత్వ నడకలో పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లకు విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.
  • ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీమతి వాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి కనకదుర్గ భవాని, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, సెట్నల్ సీఈవో శ్రీ పుల్లయ్య, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here