ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులతో గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, వూటుకూరు శ్రీనివాస్‌లతో గవర్నర్ హరిచందన్ తొలుత ప్రమాణ స్వీకారం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పన వరాహలక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లిఖార్జునరావు, దుప్పల వెంకట రమణ అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాల రాజు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్, ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.