హైదరాబాదీ అబ్బాయి.. పాకిస్తానీ అమ్మాయి.. మధ్యలో బోర్డర్

0
8

హైదరాబాద్‭ ప్రియుడి కోసం సరిహద్దు దాటబోయిన పాక్ మహిళ అరెస్ట్: పాకిస్తాన్‭లో ఉన్న తన భార్య కోసం హీరో పాకిస్తాన్ వెళ్లి ఎన్ని కష్టాలు పడతాడో ‘గద్దర్-ఏక్ ప్రేమ్ కథ’ అనే సినిమా చూసిన వారందరికీ గుర్తుండే ఉంటుంది.

మొన్నీ మధ్యే పూరీ జగన్నాథ్ తన కొడుకుని హీరోగా పెట్టి ‘మెహబూబా’ అనే సినిమా తీశారు. అటు ఇటుగా ఇది కూడా అలాంటి కథే. ‘ఇరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రేమలో పడటం.. దేశ సరిహద్దులు దాటి కలుసుకోవడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడటం’ ఇలాంటి సినిమాల్లో కామన్‭గా కనిపించే పాయింటే ఇది. సినిమా కాదు కానీ, ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. భారత ప్రియుడి కోసం సరిహద్దు దాటబోయి భద్రతా దళాల కంట పడి లేని చిక్కులు కొని తెచ్చిపెట్టుకుంది ఒక మహిళ. అనకుంటాం కానీ.. నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎక్కువే. బహుశా.. ఇలాంటి నిజ సంఘటనల నుంచే కాబోలు మరింత మసాలా అద్ది సినిమాలకు స్టోరీలను తయారు చేస్తుంటారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదీ అబ్బాయి.. పాకిస్తానీ అమ్మాయి.. సోషల్ మీడియాలో ప్రేమ.. సినిమాల్లో మామూలుగా హీరోయిన్ కోసం హీరో సరిహద్దులు దాటుతుంటాడు. కానీ ఇక్కడ ప్రియుడి కోసం ప్రియురాలే సరిహద్దు దాటబోయింది. నేరుగా ఇండియా రావడం కుదరదని నకిలీ ఆధార్ సహా మరికొన్ని నకిలీ పత్రాలు తయారు చేసుకుని నేపాల్ గుండా ఇండియాలోకి ప్రవేశించబోయి.. సరిహద్దులోనే భద్రతా దళాలకు దొరికిపోయింది.

అమ్మాయి పేరు కలిసా నూర్. పాకిస్తాన్‭లోని ఫైసలాబాద్ నివాసి. హైదరాబాద్‭కు చెందిన అహ్మద్‭తో ప్రేమలో పడింది. అహ్మద్ గల్ఫ్‭లో ఒక హోటల్‭లో పని చేస్తున్నాడు. తన కోసం హైదరాబాద్ రావానుకున్న నూర్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు. దుబాయ్‭లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు సహాయంగా ఉంటారు. నూర్‭ను ముందుగా నేపాల్ తీసుకువచ్చి అక్కడి నుంచి భారత్‭లోకి ప్రవేశించేలా ప్లాన్ వేశారు. నకీలీ ఆధార్, సర్టిఫికెట్లు సిద్ధం చేశారు. ముగ్గురు కలిసి ఇండియాలోకి ప్రవేశిస్తుండగా భద్రతా దళాలు వారిని విచారించాయి. సర్టిఫికెట్లు తీసి పరిశీలించగా అవన్నీ నకిలీవని తేలింది. అయితే వారి ప్రేమ విషయం చెప్పి బతిమాలుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం.. తమ డ్యూటీ చేయాలంటూ ముగ్గురినీ బిహార్ పోలీసులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here