- 5జీ స్పెక్ట్రమ్ వేలంలో 700 మెగాహెర్జ్ బ్యాండ్‌పై రిలయన్స్ జియో అధిక ఆసక్తి చూపింది. కేవలం జియో మాత్రమే ఈ విభాగంలో బిడ్లను దాఖలు చేసింది.మిగిలిన ఏ సంస్థలూ కూడా దీనిపై అంత ఆసక్తి చూపించలేదు.
ఏ టెలికం సంస్థా వద్దనుకున్న 700 మెగాహెర్జ్ బ్యాండ్‌పై జియోకు ఎందుకంత ఆసక్తి…?
అసలు దాని ప్రత్యేకత ఏంటి…? మిగిలినవి ఎందుకు ఆ విభాగానికి దూరంగా ఉన్నాయి…?
- రిలయన్స్ జియో 700 మెగాహెర్జ్ బ్యాండ్‌పై అధిక ఆసక్తి చూపడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. 5G మార్కెట్‌ను కొల్లగొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న జియో దానికి అనుగుణంగా దీనిపై దృష్టిపెట్టింది. 700 మెగాహెర్జ్ బ్యాండ్‌ను యూరోప్, అమెరికాలో 5జీ కోసం ప్రీమియం బ్యాండ్‌గా పరిగణిస్తారు. దీంతో 700 MHz బ్యాండ్‌లో స్వతంత్ర 5G నెట్వర్క్ సాధ్యమవుతుందని జియో భావిస్తోంది.
- ఇంటా బయటా చక్కని సిగ్నల్‌తో అత్యుత్తమ నెట్వర్క్ అందుతుంది. టవర్ కవరేజీ సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. దీనికి మరో బ్యాండ్‌విడ్త్‌ను జతచేస్తే 5జీ స్పీడ్ మరింత పెరుగుతుంది. ఇన్ని స్పెషాలిటీలు ఉండటంతోనే రిలయన్స్ జియో 700 Mhzపై ఎక్కువ ఆసక్తి చూపింది. 700 Mhz అనేది లోఫ్రీక్వెన్సీ బ్యాండ్. మిగతా తరంగాలతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. 600 Mhz, 800 Mhz బ్యాండ్ విడ్త్‌లో కూడా తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా 5జీ సిగ్నల్స్ కోసం ఎక్కువగా 700 Mhz బ్యాండ్‌నే వాడుతున్నారు.

- 5జీతో పని చేసే మొబైల్, ల్యాప్‌టాప్ ఇతర గ్యాడ్జెట్లను 700 Mhz ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఒకవేళ భారత టెలికాం సంస్థలు 700 Mhz కాకుండా వేరే ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 5జీ సేవలు అందిస్తే.. అందుకు అనుగుణంగా మొబైల్, ల్యాప్‌టాప్‌లలో మార్పులు చేయాలి. ఒకటి రెండు టెలికాం కంపెనీల కోసం హ్యాండ్సెట్ తయారీ సంస్థలు అలా తయారు చేయలేవు. అందుకే రిలయన్స్ జియో అన్నింటికీ కలసివచ్చేలా 700 Mhzను టార్గెట్ చేసింది. ఈ విభాగంలో స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన ఏకైక ఆపరేటర్‌గా నిలిచింది.
- గత ఏడాదితో పాటు 2016లో కూడా 4జీ వేలంలో 700 MHZ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను వేలానికి ఉంచారు. అయితే ఆ సమయంలో టెలికాం కంపెనీలు ఆసక్తి చూపకపోవడంతో అనుకున్న స్థాయిలో బిడ్లు రాలేదు. కేవలం 40శాతం స్పెక్ట్రమ్‌కు మాత్రమే ఈ విభాగంలో బిడ్లు దాఖలయ్యాయి. అయితే ఈసారి మాత్రం రిలయన్స్ జియో ఈ విభాగంపై ఎక్కువ ఫోకస్ చేసింది. అధిక బిడ్లను దాఖలు చేసింది.
- 700 MHZ ఫ్రీక్వెన్సీ కోసం రిలయన్స్ జియో ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తుందో అన్న అంశం ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో రెండుసార్లు ఈ విభాగంలో స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టినప్పుడు అధిక రేటును నిర్ణయించారు. కానీ ఈసారి మాత్రం 700 MHZ రేటును 40శాతం పైగా తగ్గించింది ప్రభుత్వం. దీంతో అమ్ముడు పోకుండా గతంలో మిగిలిన 60శాతం బ్యాండ్ విడ్త్‌పై రిలయన్స్ జియో ఫోకస్ పెట్టింది.