జాతీయ పార్టీ హోదాకు అడుగు దూరంలో ‘ఆప్’.. కేజ్రీవాల్ ట్వీట్
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ‘జాతీయ పార్టీ’గా గుర్తింపు పొందడానికి అడుగు దూరంలో నిలిచింది. ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉన్న ఆప్.. గోవాలోనూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది. దీంతో మరో రాష్ట్రంలోనూ గుర్తింపు సాధిస్తే.. తమ పార్టీని ఎన్నికల సంఘం అధికారికంగా జాతీయ పార్టీగా ప్రకటిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్, దాని భావజాలం పట్ల విశ్వాసం ఉంచిన ప్రజలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఆప్ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.
2012 చివర్లో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీలో పాగా వేసింది. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన ఆప్ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆ పార్టీ రెండు చోట్ల విజయం సాధించింది. గోవా ఎన్నికల్లో ఆ పార్టీకి 6.8 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో తాజాగా ఆప్‌ను గోవా రాష్ట్ర పార్టీ గా ఎన్నికల సంఘం గుర్తించింది.