- శివసేన నుంచి ఇప్పుడు జేడీయూ వరకు.. బీజేపీకి మిత్రులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. అసలీ పరిస్థితి ఎందుకు వస్తోంది.. బ్రేకప్ స్టోరీస్ వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయా..
- ఇది జేడీయూతోనే ఆగిపోతుందా.. మరికొన్ని పార్టీలు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయా.. బీజేపీ, మిత్రపక్షాల స్టోరీలో ఎలాంటి మలుపులు చూడబోతున్నాం…
- బీహార్ పరిణామాల తర్వాత ప్రతీ ఒక్కరిలో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. దేశం అంతా తామే అధికారంలో ఉండాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బహిరంగంగా అదే విషయం ప్రకటిస్తోంది కూడా. ప్రాంతీయ పార్టీల అండతో రాష్ట్రాల్లో బలపడి .. ఆ తర్వాత అదే ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు నితీష్ టార్గెట్ చేసిందనేది కూడా ఓ ఆరోపణ. నిజానికి వరుస పరిణామాలకు ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు బిహార్ మాత్రమే కాదు.. ఈ మధ్యే ముగిసిన మహారాష్ట్ర పంచాయితీతో పాటు.. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో దోస్తీకి కూడా బ్రేక్ పడింది.
- రెండు ప్రాంతీయ పార్టీల్లో చెలరేగిన అలజడిని.. బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. పరోక్షంగా మద్దతు సంపాదించింది. బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ.. ఎన్డీఏలో ఒకప్పుడు భాగంగా ఉండేది. కానీ రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చేపట్టిన ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడుకొందన్న విమర్శలున్నాయి. బీహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులున్న చోట బలమైన క్యాండిడేట్లను నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చింది ఎల్‌జేపీ. ఎన్నికలయ్యాక చిరాగ్‌ను పట్టించుకోవడం మానేసింది బీజేపీ నాయకత్వం. అదే సమయంలో ఎల్‌జేపీలో చెలరేగిన తిరుగుబాటు సమయంలో … చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆయన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు బీజేపీ సపోర్ట్ చేసింది. ప్రస్తుతం పార్టీ పూర్తిగా పశుపతి హ్యాండోవర్‌లో ఉంది. పాశ్వాన్ వారసుడిగా చక్రం తిప్పుదామనుకున్న చిరాగ్.. బీహార్ పాలిటిక్స్‌లో కంప్లీట్‌గా సైడ్ అయిపోయారు.
- మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో నిలబడ్డ బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీనే మింగేసే పరిస్థితి వచ్చింది. సీఎం పదవి విషయంలో వచ్చిన పేచీతో ఎన్నో ఏళ్లుగా కలిసి వస్తున్న శివసేనకు రాం రాం చెప్పేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు పూర్తికాకముందే.. శివసేనలో రేగిన అసమ్మతిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకుంది కమలం పార్టీ. దీంతో ఇప్పుడు శివసేన పార్టీ అస్తిత్వం కోసం పోరాడాల్సిన వచ్చిన పరిస్థితి. షిండే ప్రభుత్వంతో ఒకరకంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మనుగడలో ఉన్నట్లే అన్న చర్చ నడుస్తోంది. ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఎన్నికల ముందు అన్నాడీఎంకేకు అన్ని విధాలుగా మద్దతు ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఏఐడీఎంకే వచ్చే లాభం లేదని.. కమలం పార్టీ దూరంగా ఉంటోంది.
- ఇక వ్యవసాయ చట్టాల విషయంలో శిరోమణి అకాళీదళ్ కూడా.. బీజేపీతో దోస్తీ గుడ్‌బై చెప్పింది. అటు అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది. పార్టీ పెట్టించి ఆయనతో పొత్తు పెట్టుకుంది. కానీ.. బీజేపీ-అమరీందర్ కూటమి పంజాబ్‌లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. పంజాబ్ సీఎంగా, కాంగ్రెస్ నేతగా తిరుగులేని అధికారం చెలాయించిన అమరీందర్ సింగ్.. ఇప్పుడు అడ్రస్‌లేకుండా పోయారు. ఇలా కొందరు బీజేపీకి దూరంగా ఉంటే.. కొందరిని వ్యూహాత్మంగా బీజేపీ దూరం పెట్టిందన్న చర్చ నడుస్తోంది.
- లోక్ జనశక్తి, శివసేన పరిణామాల తర్వాత బీజేపీ కొత్త టార్గెట్… నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ అనే విశ్లేషణ ఎప్పటినుంచో వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయ్. ఐనా నితీష్‌కే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చి గౌరవించింది బీజేపీ. ఐతే ఇదంతా పైకి కనిపించేది మాత్రమే అని.. చిరాగ్ పాశ్వాన్‌కు ఝలక్ ఇచ్చినట్లు నితీష్‌కు కూడా కమలం పార్టీ త్వరలోనే ట్రీట్‌మెంట్ ఇవ్వబోతుందన్న గుసగుసుల వినిపించాయ్. ఐతే ముందుగానే అప్రమత్తం అయిన నితీష్.. బీజేపీ నేర్పిన పాఠాన్ని ఆ పార్టీకే అప్పజెప్పారు. బీజేపీ షాక్ ఇవ్వడానికి ముందే రివర్స్ షాక్ ఇచ్చారు. ఎన్డీఏకు గుడ్‌బై చెప్పేసి.. యూపీఏ వైపు మొగ్గుచూపారు. ఐతే నితీష్ నిర్ణయంతో ఇప్పటికిప్పుడు బీజేపీకి స్ట్రాంగ్ ఝలక్ తగిలినట్లే అన్న చర్చ వినిపిస్తోంది.
- దేశవ్యాప్తంగా తమ పార్టీనే అధికారంలో ఉండాన్న పట్టుదలతో బీజేపీ కనిపిస్తోంది. దీనికోసం ఎలాంటి ఎత్తుగడలు వేసేందుకయినా సిద్ధం అవుతోంది. మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అడుగులు వేస్తోందన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రాసెస్‌లో కొందరు మిత్రులు బీజేపీకి దూరం అవుతుంటే.. కొందరిని బీజేపీ దూరం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ మాత్రమే కాదు.. పాలిటిక్స్ కూడా అని ప్రస్తుత పరిణామాలను లెక్కేస్తూ మరికొందరు చెప్తున్న మాట.