పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు…అమిత్ షా కీలక భేటీ

0
5
Attacks on PFI offices...Amit Shah's key meeting

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతోన్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు.జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ దినకర్‌ గుప్తా సహా పలువురు కీలక అధికారులతో ఆయన గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఈ భేటీలో చర్చించినట్లు ఓ అధికారి వెల్లడించారు..

నిషేధం విధిస్తారా..?

యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్టవిరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో నేడు ఎన్‌ఐఏ,ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది. అయితే, ఈ దాడుల అనంతరం కేంద్రం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొనసాగుతోన్న అరెస్టులు..

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100 మందికి పైగా కార్యకర్తలు, నేతలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పీఎఫ్‌ఐ మాజీ కోశాధికారి నదీమ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here