న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ల రంగంలో స్వదేశీ కంపెనీలకు ఊతమివ్వడమే లక్ష్యంగా చైనా మొబైల్ కంపెనీలకు(Chinese Mobile Companies) కళ్లెం వేయాలని కేంద్ర సర్కార్(Centre Govt) యోచిస్తోంది.
- ఇందుకు వ్యూహాత్మకంగా రూ.12 వేల లోపు చైనీస్ ఫోన్లపై(Chinese Phones) నిషేధం విధించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్లో తక్కువ రేటు ఫోన్ల కేటగిరి నుంచి చైనా కంపెనీలకు ఉద్వాసన పలకడమే లక్ష్యంగా చర్యలు ఉండొచ్చని సంకేతాలిచ్చాయి. ఈ మేరకు చర్యలు తీసుకుంటే షియోమీ కార్ప్(Xiaomi Corp) సహా పలు చైనీస్ మొబైల్ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బగానే భావించాలి. పెద్ద సంఖ్యలో మొబైల్స్ ఉత్పత్తి చేసే రియల్మీ, ట్రాన్షన్ హోల్డింగ్స్ వంటి కంపెనీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దేశీయ తయారీదార్లు వాపోతున్న తరుణంలో ఈ పరిణామం జరగబోతుండడం గమనార్హం.

- కొవిడ్, లాక్డౌన్ నేపథ్యంలో వినియోగం మందగించడంతో దేశీయ మొబైల్ తయారీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి 150 డాలర్లు లోపు చైనీస్ స్మార్ట్ఫోన్లపై నిషేధం విధించాలని కేంద్ర యోచిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారి ఒకరు పేర్కొన్నారు. రూ.12 వేల లోపు మొబైల్ సెగ్మెంట్లో చైనా మొబైల్ కంపెనీల వాటా 80 శాతం వరకు ఉందని అధికారి తెలిపారు. కాగా చైనా కంపెనీలను నియంత్రించేందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఏదైనా పాలసీ ప్రకటిస్తారా లేదా అనధికార విధానాలను అవలంభిస్తారా అనేది వేచిచూడాల్సి ఉందని పేర్కొన్నారు.
- అయితే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం యాపిల్, సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే ఈ కంపెనీల ఫోన్ల ధరలు ఎక్కువ స్థాయిలో ఉండడమే కారణంగా ఉంది. అయితే రిపోర్టులపై టెక్నాలజీ మినిస్ట్రీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.