Basara IIITలో గవర్నర్ తమిళిసై..

0
3

బాసర ట్రిపుల్ ఐటీని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై ఆరా తీశారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) ఆదివారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌(Basara IIIT Campus)ని సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వరకు రైల్లో ప్రయాణించిన గవర్నర్‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాసరకు వెళ్లారు. ఉదయం సరస్వతి ఆలయాన్ని సందర్శించిన ఆమె అక్కడి నుంచి నేరుగా ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన గవర్నర్ ట్రిపుల్‌ ఐటీ విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, మెస్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్శిటీ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గవర్నర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. సమస్యలు ఉన్నాయని విద్యార్థులెవరూ చదువును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని అధికారులను సూచించారు.

ఇటీవల రాష్ట్రంలోని 11 యూనివర్శిటీలకు చెందిన విద్యార్థి సంఘాల నేతలతో గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు యూనివర్శిటీల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఈ కోవలోనే ముందుగా ఆమె బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి సమస్యలపై ఆరా తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here