కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటింది. స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెల్లె లీని ఓడించింది. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన పీవీ సింధు.. అదే ఊపులో రెండో గేమ్‌ను 21-13తో గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజత పతకం సాధించింది.ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏ దశలోనూ తడబాటు లేకుండా అద్భుత ప్రదర్శ చేసింది. సెమీస్‌లో సింగ్‌పూర్‌కు చెందిన యో జియా మిన్పై 21-19, 21-17 తేడాతో సింధు అద్భుత విజయ సాధించింది. సెమీస్‌లో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కీలకమైన సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా సింధు సత్తా చాటింది. రెండో సెట్లోనూ ఆధిక్యం మారుతూ వచ్చినా.. ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తలపడింది. 11-9 ఛేంజ్ ఓవర్ తర్వాత కూడా ప్రత్యర్థి మిన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్ పాయింట్‌ను సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.