ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన ఈజిప్టు అంటే ఎన్నోవేల మమ్మీలు, వందల పిరమిడ్లకు ప్రత్యేకత. తాజాగా జరిపిన పురావస్తు తవ్వకాల్లో 4,500 ఏళ్ల కిందట సూర్య దేవాలయం బయటపడింది. రాజధాని కైరోకు సమీపంలో ఉండే అబుసర్ రీజియన్‌లో బయటపడిన ఈ ఆలయం ఈజిప్టులోని అత్యంత నాలుగు పురాతన సూర్య దేవాలయాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని బహుశా 2465 BC నుంచి 2323 BC వరకు పాలించిన ఐదో రాజవంశానికి చెందిన రాజు నియుసెర్రా నిర్మించి ఉంటారని పోలెండ్, ఇటలీ పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. పానీయాలు తాగడానికి ఉపయోగించే కంటైనర్లు, గాజులు, సిరామిక్ పాత్రలతో సహా అనేక కళా ఖండాలు కూడా బయల్పడ్డాయి.పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఆలయం, కళా ఖండాల గురించి ఈజిప్టు పురావస్తు, పర్యాటక మంత్రి జులై 31న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘అబూ సర్‌కు ఉత్తరాన ఉన్న అబు ఘోరాబ్‌లోని కింగ్ నియుసెర్రా ఆలయంలో ఇటలీ-పోలెండ్ ఉమ్మడి ఆర్కియోలాజికల్ మిషన్ పనిచేస్తోంది.. ఆలయం కింది భాగంలో మట్టి-ఇటుక భవనం అవశేషాలను కనుగొంది.. ఈ అవశేషాలు ఐదో రాజవంశం సమయంలో కోల్పోయిన నాలుగు సౌర దేవాలయాలలో ఒకదానికి చెందినవి కావచ్చని ఆవిష్కరణ సూచిస్తుంది.. ఇది చారిత్రక మూలాలలో మాత్రమే తెలిసింది కానీ ఇప్పటివరకు దీనిని కనుక్కోలేదు’’ అని అన్నారు.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఐదో రాజవంశం ఆరో పాలకుడు ఫారో తాను ఆలయాన్ని నిర్మించడానికి ఈ నిర్మాణంలో కొంత భాగాన్ని పడగొట్టాడు. అన్వేషణ బృందం పరిశోధనలకు సహాయపడే అనేక కుండలు, బీర్ గ్లాసులను కనుగొంది.
పురాతన ఈజిప్షియన్లు పురాణాల ప్రకారం వారు ముఖ్యమైన సౌర దేవత ‘రా’ని ఆరాధించారు. సూర్యుడు వారికి కాంతి, శక్తికి మూలం. ముఖ్యంగా ఈజిప్షియన్ రాజుల (ఫారోలు) పోషక దేవత. ఈ దేవతను గద్ద తల ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు. ఈజిప్టులో మొదటి సూర్య దేవాలయం 19వ శతాబ్దంలో కనుగొన్నారు. రాజు నియుసెర్రే సూర్య దేవాలయంతో పాటు ఆరు పిరమిడ్లను కూడా నిర్మించాడు. సెఖ్‌మెట్, వాడ్జెట్, మెన్హిత్, హతౌర్, ఐసిస్ వంటి దేవతలను పురాతన ఈజిప్షియన్ మతంలో ఆరాధించారు. ఫారోను ‘రా’ కుమారుడిగా పిలిచేవారు.