హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైస్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు
హర్ష సాయి, ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. అదేనండి యూట్యూబ్‌లో పేదలకు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఆశ్చర్యపరిచే యువకుడు. కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేయడం హర్ష సాయికి అలవాటు. పేదల కళ్లల్లో ఆనందం చూడటం కోసం అతడు చేసే పనులు.. చాలామందికి స్ఫూర్తిదాయకం. అందుకే, ఆయన యూట్యూబ్, సోషల్ మీడియా పోస్టులకు అంత ఫాలోయింగ్.
హర్షసాయి తాజాగా మరో అద్భుతం చేశాడు. ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రయత్నం చేశాడు. 101 మంది పేదలకు ఫైస్టార్ హోటల్‌లో కడుపు నిండా భోజనం పెట్టాడు. ఇంతకీ ఒక్కో ప్లేటు భోజనం విలువ ఎంతో తెలుసా? రూ.30 వేలు. ఔనండి, మీరు విన్నది నిజమే. ఎందుకంటే.. అతడు ఎంచుకున్నది సాదాసీదా హోటల్ కాదు. దేశంలోనే అత్యంత సంపన్నులు, రాజకీవేత్తలు, అంతర్జాతీయ నేతలు మాత్రమే బస చేసే అత్యంత విలాశవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో. అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంక ట్రంప్‌లు కలిసి విందు ఆరగించినది ఇక్కడే.
ఆ చిన్నారుల వీడియోనే స్ఫూర్తి: పేదలు గేటు ముందు ఉంటేనే చీదరించుకొనే ఫైవ్‌స్టార్ హోటల్‌లో.. వారికి ప్రవేశం ఉంటుందంటే ఊహించుకోగలమా? కానీ, హర్షసాయి అది చేసి చూపించాడు. ఈ ఆలోచన రావడానికి గల కారణం ఓ వైరల్ వీడియో. ముంబైలో ముగ్గురు పిల్లలు దాచుకున్న డబ్బులతో పిజ్జా కొనడానికి వెళ్లారు. ఆ పిల్లల దుస్తులు మురికి ఉండటంతో అక్కడి సిబ్బంది వారిని బయటకు పంపేశారు. మేం డబ్బులు తెచ్చుకున్నా పిజ్జా ఇవ్వండన్నా.. ఇవ్వకుండా వారిని వెళ్లగొట్టారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన హర్ష సాయి గుండె బరువెక్కింది. పేద, ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలనే లక్ష్యంతో హర్షసాయి ఈ ప్లాన్ చేశాడు.
రైతుకు చుక్క నీరు ఇవ్వని ఫైవ్‌స్టార్ హోటల్: తన ప్లాన్‌లో భాగంగా.. హర్ష సాయి ఓ రైతును ఓ ఫైవ్ స్టార్ హోటల్ వద్దకు వెళ్లి ఒక గ్లాస్ వాటర్ అడగమని పంపారు. అయితే, అక్కడి సెక్యూరిటీ అతడికి నీళ్లు ఇవ్వకుండానే బయటకు పంపేశాడు. ఇలా రెండు మూడు హోటళ్లలో జరిగింది. దీంతో హర్షసాయి హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన, రాయల్ హోటల్‌లో పేదలకు ఉచితంగా విందు భోజనం తినిపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎంపిక చేసుకున్నాడు.