వైఎస్సార్‌సీపీ నేత, నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రూటు మార్చారు. జనసేన పార్టీ లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఆ దిశగానే ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకటి రెండు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధికారికంగా ప్రకటించకపోయినా సరే.. ఆ పార్టీ నేతల్ని కలుస్తున్నారు. తాజాగా ఆయన జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు ను కలిశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పృథ్వీ జనసేన పార్టీలో చేరడం ఖాయమని.. త్వరలోనే చేరిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే జనసైనికుల వాదన మరోలా ఉంది. రాజా బోయిడి అనే వ్యక్తి జనసేన పార్టీ కోసం ఒక సాంగ్ రూపొందించారని.. అది వినిపించటానికి పృథ్వీరాజ్‌కి ఉన్న పరిచయాలు ద్వారా నాగబాబు గారిని కలవటానికి ఇద్దరు వచ్చారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతే కానీ పృథ్వీరాజ్ పార్టీలో చేరటం కానీ చేర్చుకోవటం లాంటి చర్చ జరగలేదంటున్నారు. అంతేకాదు కొంతమంది జనసైనికులు పృథ్వీ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను, జనసేన పార్టీని దారుణంగా తిట్టారని, నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.నటుడు పృథ్వీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి జైకొట్టారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు SVBC (శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్ పదవీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. ఓ మహిళా ఉద్యోగితో వెనకనుంచి పట్టుకుంటా అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్న ఫోన్ కాల్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత పృథ్వీ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే SVBC చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు పృథ్వీ దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు జనసేన పార్టీకి దగ్గరవుతున్నారు. మరి ఆయన పొలిటికల్ జర్నీ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అన్నది చూడాలి.