MP మాగుంటకు కొత్త చిక్కులు…..

0
2

వైసీపీ ఎంపీ మాగుంటను వివాదాలు వీడటం లేదు.
ఇన్నాళ్లు తన పని తాను చేసుకుంటూ పోయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సొంత పార్టీ వారితో పాటు ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేయడంతో సతమతమవుతున్నారు. తాజాగా పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది

ఈ ప్రచారాలను మాగుంట ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అసలు ఏంటి అంటే..

ఎంపీ మాగుంట శ్రీనివాస్ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా పెద్దగా వివాదాల్లోకి రాలేదు. అన్న మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా తమ వ్యాపారాలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. కాంగ్రెస్‌, టీడీపీలలో కొనసాగినా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా ఆయన పేరు వినిపించేది కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం డిస్ట్రిలరీలలో తిరుగులేని ఆధిపత్యం కలిగి ఉన్న మాగుంట కుటుంబానికి ఇన్నాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ఇటీవలి కాలంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డితో మాగుంటకు విభేదాలు తలెత్తాయి. బాలినేని వివాదాల్లో చిక్కుకోవడానికి మాగుంటే కారణమని ప్రచారం జరిగింది. దీంతో బాలినేని సొంత పార్టీ వారే తనపై కుట్రలు చేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కాళ్లు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగిన వైసీపీలో మాగుంటకు ఇబ్బందులు తప్పడం లేదనే ప్రచారం కూడా ఉంది.

వచ్చే ఎన్నికల్లో తన బదులు తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని మాగుంట కోరుతున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ఆయన్ని మనస్తాపానికి గురి చేసినట్లు చెబుతున్నారు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన కొడుకు ప్రణీత్‌ను ఒంగోలు నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేనితో సరిపడక మాగుంట పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ఆయన్ని టార్గెట్ చేసింది.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014కు ముందు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. వైఎస్‌ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీ వర్గంగా జగన్‌కు దూరంగా ఉండిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. 2019ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు. 2019కు ముందు వరకు వివాదాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. 2019 తర్వాత ఆయనకు చిక్కులు మొదలయ్యాయి. ఈ సారి వద్దనుకున్నా వివాదాలు చుట్టుముడుతున్నాయి. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలతో ఎంపీకి పొసగడం లేదు. టీడీపీ, బీజేపీలలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాలను మాగుంట ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు

దాదాపు 35కంపెనీల్లో వాటాలున్న మాగుంట చెన్నై కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. దేశంలో విక్రయించే ప్రముఖ మద్యం బ్రాండ్ల తయారీకి డిస్టిలరీలున్నాయి. ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఇటీవల మాగుంట కుటుంబం ఢిల్లీ మద్యం టెండర్లలో పాల్గొంది. ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేట్ వారికి అప్పగించారు. జోన్ల వారీగా దుకాణాలను విభజించి ఢిల్లీలో 32 జోన్లలో విక్రయాలకు వేలం వేశారు. ఒక్కో జోన్‌లో 21 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది.
ఏపి క్రైమ్ న్యూస్

బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నమాగుంట కంపెనీ ఢిల్లీలో వ్యాపారం దక్కించుకుందని ఆ పార్టీ ఆరోపించింది. 144కోట్ల రుపాయలు చేతులు మారాయని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ సర్కారు మాత్రం ప్రభుత్వానికి ఆదాయం 27శాతం పెరిగి రూ.890 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతోంది. అటు మాగుంట కూడా ఢిల్లీలో వ్యాపారం నిర్వహణకు అన్ని అనుమతులు ఉన్న ఆగ్రో ఫార్మ్స్‌ సంస్థకు టెండర్లు దక్కాయని మాగుంట చెబుతున్నారు. రాజకీయంగా బీజేపీ వైపు నుంచి విమర్శలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మాగుంట వైసీపీ కంటే మరో పార్టీలోకి సురక్షితంగా చేరిపోతారనే ప్రచారం ఊపందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here