కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్

0
14

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆ పార్టీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికను అక్టోబర్ 17న అన్ని రాష్ట్రాల్లోని పీసీసీల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు.

అక్టోబర్ 8లోగా నామినేషన్లను ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారని పార్టీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.ఇప్పటి వరకూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ ఒక వ్యక్తికి ఒకే పదవి అని గతంలో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ నిర్ణయించింది.

ఇటీవల గెహ్లట్ సోనియా గాంధీని కలవగా ఆమె కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం.సచిన్ పైలట్‌కు రాజస్థాన్ సీఎం పగ్గాలు అప్పగించడం కోసమే వ్యూహాత్మకంగా గెహ్లట్‌కు ఏఐసీసీ పగ్గాలు అప్పగించాలని సోనియా, రాహుల్ నిర్ణయించారనే భావన సైతం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం గెహ్లట్ ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారా? అనేది చూడాలి.భారత్ జోడో యాత్రతో ప్రజానీకానికి చేరువ అవుతోన్న రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ విభాగాలు రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశాయి.

కానీ ఆయన మాత్రం ఆ పదవి పట్ల ఆసక్తి చూపడం లేదు. భారత్ జోడో యాత్రను మధ్యలో వదిలేసి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలిసే అవకాశం ఉంది.

1998 నుంచి 2017 వరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2017లో రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించారు. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన మనసు మార్చుకుంటారని ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.

ప్రధాని మోదీ పట్ల జనంలో విశేషమైన ప్రజాదరణ ఉంది. ఆయనకు సరితూగగలిగే నాయకుడెవరూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు ఎవరికి వారే అన్నతీరుగా వ్యవహరిస్తున్నాయి. పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకు రావడం మోదీకి వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్ నాయకత్వంలో పోరాడేలా.. ప్రాంతీయ పార్టీలను ఒప్పించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం ఏఐసీసీ అధ్యక్షుడి ప్రధాన బాధ్యతలయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here