రాజగోపాల్ రెడ్డి ఒంటరి పోరాటం తప్పదా? కాంగ్రెస్ భయాలేంటీ? టీఆర్ఎస్ వ్యూహాలేంటి ?
- మునుగోడు బైపోల్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తోంది. విజయం కోసం కనిపించిన అన్ని దారులను అన్వేషిస్తున్నాయ్ పార్టీలు !

- దీంతో పొలిటికల్ సీన్ మరింత రసవత్తరంగా మారింది. ఇంతకీ ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయ్. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాయ్. ఏ పార్టీకి ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయ్. రాజగోపాల్‌కు కూడా చాలెంజెస్ తప్పవా ?
- దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలతో పోలిస్తే.. మునుగోడు బైపోల్ డిఫరెంట్ అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. దుబ్బాకలో రఘునందన్ రావు మీద, హుజురాబాద్‌లో ఈటల మీద సింపతీ వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆ స్థాయిలో సింపతీ వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ రెండు కళ్లలాంటి వాళ్లు. అలాంటిది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ నుంచి టీఆర్ఎస్ మీద పోరాటానికి సిద్ధం అవుతున్నారు. మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. గత ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున పోటీ చేసిన మనోహర్ రెడ్డికి కేవలం 12వేల ఓట్లు మాత్రమే వచ్చాయ్. కమలం పార్టీకి అక్కడ పెద్దగా కేడర్ లేదు. దీంతో ఇప్పుడు మునుగోడులో బీజేపీ విజయం సాధించాలంటే.. రాజగోపాల్ రెడ్డి ఒంటరి పోరాటం చేయక తప్పదు అన్న చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది..
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తన సొంత కష్టం మీదే మునుగోడులో నెట్టుకురావాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కమలం పార్టీ నేతలు మునుగోడులో ల్యాండ్ అయినా.. సింగిల్ హ్యాండ్‌తో రాజగోపాల్ రెడ్డి పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఇక సామాజికవర్గం పరంగా చూసినా రెడ్లు చాలా తక్కువ. కేవలం 4 శాతానికి అటు ఇటుగా ఉన్నారు. బీసీలు భారీగా ఉన్నారు. అలాంటిది ఇక్కడ బీసీ అభ్యర్థిని టీఆర్ఎస్, కాంగ్రెస్ బరిలోకి దించితే.. కోమటిరెడ్డికి సవాళ్లు ఎదురుకావడం ఖాయం. దీనికితోడు ఉపఎన్నిక జరగడానికి తక్కువలో తక్కువ నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని రోజులు జనాల్లో ఉండాలి.. పార్టీ కేడర్‌ను నిలుపుకోవాలి. వీటన్నింటిని ఎలా ఎదుర్కోబోతున్నారన్న దాని మీదే.. రాజగోపాల్ రెడ్డి విజయం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
- రాజగోపాల్ సంగతి ఎలా ఉన్నా.. ఈ ఉపఎన్నికను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుంది. రాజగోపాల రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలందరూ.. ఆయన వెంట నడిచారు. నాంపల్లి, మునుగోడు, చండూరు, నాంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల అధ్యక్షులు, ఒక జడ్పీటీసీ కూడా పార్టీని వీడారు. ఇపుడు ఈ ఖాళీలను నింపడంతో పాటు.. కేడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకొని.. కంచుకోటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పెద్దల మీద ఉంది. అందుకే కాంగ్రెస్‌కు మునుగోడు మరింత కీలకంగా మారింది. మునుగోడులో ఫలితం కాస్త అటు ఇటు అయినా.. హస్తం పార్టీని భారీ నష్టం వెంటాడుతోంది. అందుకే మునుగోడు మీద రేవంత్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. మునుగోడు ఉపఎన్నిక ఒకరకంగా.. రేవంత్ నాయకత్వానికి అగ్నిపరీక్షలాంటిదే !
- ఇక మునుగోడు బైపోల్ ముందే ఊహించిన టీఆర్ఎస్… ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధులతో.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సామాజికవర్గాల వారీగా ఓటర్ మనసు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్థానికుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న గట్టుప్పల్ మండల డిమాండ్ నెరవేర్చింది. గౌడ వర్గ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార పార్టీ.. మునుగోడులో భారీ సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులను దృష్టిలో పెట్టుకొనే.. నేతన్న బీమా పథకాన్ని కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టిందన్న చర్చ నడుస్తోంది. ఆగస్ట్ 15 నుంచి 57ఏళ్లు నిండిన వారందరికీ.. వృద్ధాప్య పెన్షన్లు అందిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. మునుగోడు బైపోల్‌ను దృష్టి పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
- మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు మూడు పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు బైపోల్ వ్యూహాలను.. కేంద్రమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉపఎన్నికకు నోటిఫికేషన్ రావడం ఆలస్యం.. కేంద్రమంత్రులను వరుసగా మునుగోడులో దింపడం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడులో ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్‌కు ఈ బైపోల్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే పార్టీ సెంటిమెంట్‌ను తెరమీదకు తీసుకువస్తోంది. ఇక హుజురాబాద్ ఓటమిని మరిచిపోయేలా.. మునుగోడులో విక్టరీ కొట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థులకు మాత్రమే కాదు.. పార్టీలకు అంతకుమించి అనిపిస్తోందీ బైపోల్ ! అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని పార్టీలు ఆయుధంగా మార్చుకుంటున్నాయ్.