ఆ డబ్బు ఏం చేశారో పాలకులు చెప్పాల్సిందే

0
11
The rulers have to say what they did with that money

ఏపీలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ గళం విప్పారు. పోలీసుల భద్రతా నిధి పేరుతో తీసుకుంటున్న సొమ్మును ఏం చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. పోలీసులు వాడుకుంటూ.. వారు ఎదుర్కొంటోన్న సమస్యలపై మాత్రం ఏమాత్రం దృష్టి సారించడంలేదని ఆక్షేపించారు. పోలీసులకు భత్యాలు, రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

పోలీసుల భద్రతా నిధి పేరుతో తీసుకుంటున్న సొమ్మును ఏం చేశారో పాలకులు వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పోలీసుల టీఏ భత్యాన్ని 14 నెలలుగా బకాయిలు పెట్టారన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన చిరుద్యోగులకు వేధింపులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో కానిస్టేబుల్‌ హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు.

ఇక, పోలీసులకు వీక్లీ ఆఫ్‌లంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో చెబుతున్న మాటలు.. వాస్తవంలో అమలు కావడంలేదని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్ సిబ్బంది నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అసలు పోలీసు భద్రత కోసం జీతాల నుంచి మినహాయించిన డబ్బు భద్రంగా ఉందా అని నిలదీశారు. జమ చేసుకున్న ఆ మొత్తాన్ని ఏం చేశారో పాలకులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అలాగే, తమ సమస్యల గురించి అడిగిన చిరుద్యోగులను వేధించడం మానుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. నంద్యాలలో కానిస్టేబుల్‌ సురేంద్ర హత్య కేసు నిందితుల్లో ఇప్పటికీ ఒకరిని కూడా అరెస్టు చేయలేకపోయారని దుయ్యబట్టారు. ఉన్నతాధికారులు సైతం సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులకు రావాల్సిన టీఏలు, సరెండర్ మొత్తాల్ని సకాలంలో అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here